ఇడుపు కాయితం సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. డిసెంబర్ 11న విడుదల: బన్నీ వాస్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇడుపు కాయితం చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఉల్లిపూల లిరికల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాస్, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమవుతోందని, డిసెంబర్ 11న తప్పకుండా విడుదల చేస్తున్నామని తెలిపారు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతంతో సినిమాను చూసినప్పుడు మరింత బాగా నచ్చిందని చెప్పారు. సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఇందులో ఉంటుందని, రెండు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు సినిమా ఆద్యంతం ఎంగేజ్ చేస్తూ థియేటర్ నుంచి సంతోషంగా బయటకు వచ్చేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రియదర్శి, నాగదుర్గ పోటీపడి నటించారని ప్రశంసించారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ఉల్లిపూల పాటలో ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు కనిపించే ఆనందాన్ని, ప్రపంచాన్ని అభినయ శ్రీనివాస్ అద్భుతమైన సాహిత్యంతో చూపించారని అన్నారు. సురేష్ బొబ్బిలి పాటలను ఎంతో అందంగా స్వరపరిచారని, సినిమాలో భావోద్వేగాలు, సెంటిమెంట్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పారు. బిజీ జీవితంలో మనం కోల్పోతున్న బంధాలను గుర్తుచేసేలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దానని దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెలిపారు. రెండు కుటుంబాలు కలిసి చూస్తే బంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు.
నటి నాగదుర్గ మాట్లాడుతూ, ఇప్పటివరకు విడుదలైన పాటలకు మంచి స్పందన లభించిందని, డిసెంబర్ 11న థియేటర్లలో అసలైన కంటెంట్ చూస్తారని చెప్పారు. నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ, సురేష్ బొబ్బిలి సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుందని తెలిపారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, కొత్త గొంతు కోసం అన్వేషిస్తుండగా హీనా గ్రేస్ పాడటం చూసి ఈ పాటలో అవకాశం ఇచ్చానని చెప్పారు. ఈ చిత్రంతో తొలిసారి సినిమా పాట పాడటం ఎంతో సంతోషంగా ఉందని సింగర్ హీనా గ్రేస్ తెలపగా, ఫోక్ టచ్‌తో వచ్చిన గడప, ఉల్లిపూల పాటలు ఆదరణ పొందుతాయని గీత రచయిత అభినయ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.