ముడి చమురు ధరల తగ్గింపుతో పుంజుకున్న సూచీలు
400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ స్వల్పంగా తగ్గడం భారత స్టాక్ మార్కెట్లకు కొండంత ఊరటనిచ్చింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 23,360 స్థాయికి ఎగువన స్థిరంగా కొసాగుతోంది.
ఉదయం 9:27 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపు (74,294.96)తో పోలిస్తే 423.53 పాయింట్లు (0.57%) లాభపడి 74,718.49 వద్ద ట్రేడైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.75 పాయింట్లు (0.13%) పెరిగి 23,376.15 వద్ద కొనసాగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ సూచీ 1 శాతానికి పైగా లాభపడగా.. ఐటీ, మీడియా, మెటల్, ప్రభుత్వ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 101 డాలర్లకు పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉండటం, గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా క్రమంగా కోలుకోవడం ధరల తగ్గింపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగి ఎఫ్‌ఐఐల (FII) అమ్మకాల ఒత్తిడి తగ్గితే, దేశీయ మార్కెట్లకు మరింత ఊరట లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 23,400 స్థాయి వద్ద కీలక నిరోధం (రెసిస్టెన్స్) ఎదురవుతుండగా, 23,200 మద్దతు (సపోర్ట్) స్థాయిగా పనిచేస్తోందని తెలిపారు.