వీఆర్ఏల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలి: పీడీఎస్‌యూ
అనంతపురం బ్యూరో: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన 15వ రోజు దీక్షకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) కణేకల్ డివిజన్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వీఆర్ఏలు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సమ్మెకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో, అటెండర్, నైట్ వాచ్‌మెన్ తదితర పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని కోరారు. నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయడంతో పాటు, కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లెల ప్రసాద్ కోరారు. వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి పీడీఎస్‌యూ తరఫున నిరంతరం అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కణేకల్ మండల అధ్యక్షుడు వన్నూరుస్వామి, కార్యదర్శి శ్రీకాంత్, రాజకుమార్, గంగిరెడ్డి, సురేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.