వర్ష బాధితులకు ‘సత్యసాయి ట్రస్ట్’ అండ - రేషన్ పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
పార్వతీపురం, అక్టోబర్ 02, మేజర్ న్యూస్:ఇటీవల సంభవించిన తీవ్ర వాయుగుండం కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల బారిన పడి నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్’ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా 500 ఉచిత రేషన్ కిట్లను బాధితులకు అందజేసే వాహనాన్ని శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి జండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు శ్రీ సత్యసాయి ట్రస్ట్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌లు చూపుతున్న ఉదారత అభినందనీయమని అన్నారు. గుర్తించిన లబ్దిదారులందరికీ సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని సంస్థ నిర్వాహకులకు కలెక్టరు స్పష్టంచేసారు.
సమాజంలో అత్యంత దిగువన ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులు, సహాయం లేని వయోవృద్ధులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కుమార్ మీసాల తెలిపారు. ట్రస్ట్‌కు చెందిన 'దివ్యఅమృతం' స్వచ్ఛంద కార్యకర్తలు గ్రామాలు, సచివాలయాల స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. సేకరించిన సమాచారం మేరకు పాలకొండ (120), కొమరాడ (90), సీతాంపేట (70), పాచిపెంట (65), బలిజిపేట (65), సాలూరు (50), సీతానగరం (40) మండలాల్లోని బాధితులకు ఈ 500 కిట్లను పంపిణీ చేయనున్నారు.
ఒక చిన్న కుటుంబానికి దాదాపు రెండు వారాల పాటు జీవనానికి సరిపడా బియ్యం, కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి, పాలపౌడర్ తదితర నిత్య జీవితావసర వస్తువులు ఈ కిట్‌లో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ రహర్, పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్, డిఆర్ఒ హేమలత, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.