వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని వినతి
అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి అనుబంధ అంగన్వాడి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) తిరుపతి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఆర్.సుజాత, కార్యదర్శి కె.నాగరత్న మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ కు 2019 వ సంవత్సరం నుంచి వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంపునకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇస్తున్న హామీలు నీటిమూటలు గా మారాయని తెలిపారు.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు మూడు సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మినీ వర్కర్లకు కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రూరల్ ప్రాంతాల్లోని అంగన్వాడీలకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్స్ గైడ్లైన్స్ జీవో 5 ను సవరించాలని కోరారు. మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి, మధ్యలో మానుకున్న వారికి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. లబ్ధిదారుల మెనూ పెంచాలని, ప్రీస్కూల్ పిల్లలకు ఒక్కొక్కరికి 100 గ్రాములు బియ్యం, 25 గ్రాముల కందిపప్పు, 10 గ్రాముల ఆయిల్, కాండిమెంట్స్ ఒక్కొక్కరికి కనీసం ఐదు రూపాయలు ఇవ్వాలని వారు కోరారు. ఈమేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించడానికి విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాళ్లు టి.గంగాదేవి, అలాగే ఎం.శశికళ, ఆర్.రామలక్ష్మి పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి