తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల:కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ మధ్య కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు సర్వభూషణా భూషితులై చిన్న శేషవాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.
* చిన్న శేషవాహన విశేషం:
పురాణాల ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. ఐదు తలల చిన్న శేషవాహనంపై కూర్చున్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు కుండలినీ యోగ సిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వాహన సేవను తిలకించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది.
* నేడు రాత్రి హంసవాహన సేవ:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వీణాపాణియై సరస్వతీ మూర్తి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. పాలను, నీళ్లను వేరుచేసే గుణం గల హంస వాహనం.. మంచిని గ్రహించి, అహంభావాన్ని తొలగించి శరణాగతి తత్త్వాన్ని నేర్పుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించింది. వాహన సేవల సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించిపోతున్నారు.