అర్జీ పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదు
అర్జీ పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదు
సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్ రాజాబాబు
28 గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన.. సమస్యల గుర్తింపు
‘మీకోసం’కు 458 అర్జీలు.. మంగళవారం మేదరమెట్లలో గ్రీవెన్స్
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ (PGRS) ద్వారా ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి అత్యున్నత ప్రాధాన్యమిచ్చి, సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవన్‌లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్వో పి. వెంకటరమణ, ఎస్‌డీసీ మాధురితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఉదయం నిర్వహించిన సాధారణ గ్రీవెన్స్‌లో 397 అర్జీలు, మధ్యాహ్నం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో 61 అర్జీలు నమోదయ్యాయి. మొత్తం 458 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతుల పట్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను స్వయంగా పరిశీలించి, త్వరితగతిన గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీలను కేవలం సాంకేతికంగా ముగించడం కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా (SLA) నాణ్యమైన, సహేతుకమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. తమ స్థాయిలో పరిష్కరించలేని అర్జీల విషయంలో అందుకు గల స్పష్టమైన కారణాలను అర్జీదారులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం 28 గ్రామాల్లో అధికారులు నేరుగా పర్యటించి సమస్యలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామాల చివరి సరిహద్దుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. గత వారంతో పోలిస్తే ఈసారి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, వచ్చే వారం నాటికి మరింత మెరుగైన ఫలితాలు రావాలని ఆకాంక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నారో మైక్రో లెవెల్‌లో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 28 గ్రామాల్లో గుర్తించిన సమస్యల పూర్తి వివరాలను ఎక్సెల్ షీట్‌లో నమోదు చేసి పంపాలని ఆదేశించారు.
సర్వేయర్ల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాలని కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు క్రమంగా అర్జీల సంఖ్య తగ్గేలా క్షేత్రస్థాయిలో నిరంతరం సమస్యలు పరిష్కరించే విధానం ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ సర్వేలో ప్రజల నుంచి అత్యుత్తమ సానుకూల అభిప్రాయం వచ్చేలా అధికారులు చురుగ్గా పనిచేయాలన్నారు. రీ-ఓపెన్ అయ్యే అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మేదరమెట్లలో మంగళవారం ‘మీకోసం’
అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం ‘మీకోసం’ (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో తక్షణమే పరిష్కరించదగిన వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యమయ్యే లేదా పరిష్కరించలేని అర్జీల విషయంలో అర్జీదారులకు స్పష్టమైన కారణాలను వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.