తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని శివనాథ్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి అభివాదం చేశారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.