స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు (బీసీ) సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, చట్టపరమైన పరిమితులకు లోబడి వారికి రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
శనివారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగన మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, ఎస్. సవిత, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత తదితరులతో కలసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రచార విభాగంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయాలను వివరించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి అండగా నిలిచారని, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాల్లో బీసీల రాజకీయ సాధికారతకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు…
1987లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అనంతరం 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు.
తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాయని తెలిపారు. అయితే, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. దీనివల్ల వివిధ స్థాయిల్లో సుమారు 17 వేల రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్ధరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, గతంలో ఉన్న చట్టపరమైన నిబంధనల ఆధారంగా 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయితే, న్యాయస్థానాల్లో ఎదురైన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి, చట్టబద్ధంగా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.
ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు…
బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2026 ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో నెం. 3 ద్వారా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.
ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, జిల్లాలు, సామాజిక వర్గాల నుంచి సమాచారం సేకరించి, స్థానిక సంస్థల వారీగా బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు నివేదిక సమర్పించిందని తెలిపారు. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, తదుపరి చర్యల కోసం ఎన్నికల సంఘానికి పంపినట్లు వివరించారు.
కమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల స్వభావాన్ని బట్టి వేర్వేరు యూనిట్లను ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్ పదవులకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పదవులకు సంబంధిత ప్రాంతీయ యూనిట్‌ను, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు నిర్దేశిత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి యూనిట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లకు కూడా సంబంధిత యూనిట్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్ల వివరాలు…
ప్రత్యేక కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడిస్తూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, గ్రామ పంచాయతీ సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జెడ్పీటీసీలకు 24.60 శాతం, జిల్లా పరిషత్ చైర్మన్లకు 23.08 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఈ గణాంకాల ప్రకారం స్థానిక సంస్థలన్నింటినీ కలిపి బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని తెలిపారు. కొన్ని యూనిట్లలో శాతం తక్కువగా కనిపించినప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని జనాభా వివరాలు, కమిషన్ సిఫార్సులు, చట్టపరమైన పరిమితుల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించినట్లు వివరించారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు, 34 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉన్న చోట్ల కూటమి భాగస్వామ్య పార్టీలు పార్టీ పరంగా 34 శాతానికి పైగా అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భంగం కలగకుండా చర్యలు…
రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా గౌరవిస్తూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా వారికి కేటాయింపులు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, వర్తించే చట్టపరమైన పరిమితులు మరియు న్యాయస్థానాల మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలు సన్నద్ధమవుతున్నాయని తెలిపారు.
బీసీల సాధికారతకు కూటమి ప్రభుత్వ కట్టుబడిఉంది…
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్థానిక యూనిట్‌లోని జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్ణయించినట్లు తెలిపారు. మొదట ఎస్టీ, అనంతరం ఎస్సీ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని, మిగిలిన రిజర్వేషన్ పరిధిలో బీసీలకు కేటాయింపులు చేసినట్లు వివరించారు.
కొన్ని యూనిట్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కారణంగా బీసీలకు చట్టబద్ధంగా కేటాయించగలిగే వాటా తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ, బీసీలకు అదనపు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలిపారు.
బీసీలకు న్యాయం చేయడంలో రాజీ లేదు…
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల సాధికారత కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు. బీసీలకు జాతీయ స్థాయిలో రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వ పాత్రను గుర్తించాలని పేర్కొన్నారు.
గతంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి ఎందుకు తగ్గించారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో అభ్యంతరాలు ఎదురైనప్పుడు, బీసీలకు న్యాయం చేసేందుకు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన న్యాయపరమైన మార్గాలను పరిశీలించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లామని వివరించారు.
కమిషన్ నివేదిక ప్రకారం చట్టబద్ధంగా లభించే రిజర్వేషన్లతో పాటు, బీసీలకు పార్టీ పరంగా అదనపు ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీసీలకు ఎక్కువ రాజకీయ అవకాశాలు కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యాతలని ఆయన తెలిపారు.
బీసీల రాజకీయ సాధికారత, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, ఎస్. సవిత, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.