రైతన్నలకు రాజముద్ర పుస్తకం భరోసా - బి రాజేరులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ - మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, బొండపల్లి, అక్టోబర్ 2, మేజర్ న్యూస్ :
రైతన్నలకు రాజముద్ర పుస్తకం భరోసాను కలిగిస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బోండపల్లి మండలం బి రాజేరు గ్రామంలో 875 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముందు బి రాజేరు గ్రామంలో 3.0 పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 61.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. పల్లెటూర్లే పట్టణాలకు పట్టుకొమ్మలని, అందుకే పల్లెలను అభివృద్ధి పరచటానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పల్లె పండుగను నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద జరిగిన సమావేశంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యక్రమాలను పరిశీలించారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల ఆవిష్కరించారు శాఖల వారీగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రైతుల ఫోటోల స్థానంలో జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడంతో రైతులు ఆందోళన చెందారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ సర్వే చేయించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడంతో రైతుల్లో ధైర్యం కలిగిందన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో 875 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగిందని, ఫోటో వివరాలు, వ్యక్తిగత వివరాలు, సరిహద్దు వివరాలు సరిచూసుకొని తప్పులు ఉన్నట్లయితే రెవిన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎలినీనో ప్రభావంతో రైతులకు వరి వేసే సమయం ముగిసిందని, పెసర, మినుము వంటి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత కాలానుకూలంగా ఆర్ఎన్ఆర్ వరి రకం మాత్రమే సాగు చేయటానికి వీలు పడుతుందని, అవసరమైతే రైతన్నల కోరిక మేరకు ఆ విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించాలని ఆదేశించారు. గ్రామంలో వీధిలైట్లు సమస్యను విద్యుత్ శాఖ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా ప్రస్తుతం 14 సంవత్సరాల బాలికలకు వేస్తున్న హెచ్ పి.వి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని, తద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది ఈ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి 100% పూర్తయ్యాలా చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు కృషి చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రతి ఒక్కరు కూడా శుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎస్ సుధా సాగర్, ఏఎంసీ చైర్మన్ పి వి వి గోపాలరాజు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ రాపాక అచ్చం నాయుడు, టిడిపి నాయకులు ఈదుపల్లి కృష్ణ, పాసెల సీతారామ్మూర్తి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.