ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
కుందుర్పి: మండల పరిధిలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, రాజకీయ వర్గ విభేదాలు, వ్యక్తిగత కక్షలు, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరించినా, ఇతరులను రెచ్చగొట్టినా, గొడవలకు కారణమైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఇతరుల ఓటు హక్కుకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకోకుండా సంయమనంతో వ్యవహరించాలని, గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేయాలని ఎస్ఐ మహేష్ తెలిపారు. ప్రజలందరి సహకారంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కుందుర్పి రిపోర్టర్ :- టి. రాజు