ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్
భీమవరం, సూర్య న్యూస్: ప్రభుత్వ కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించే ప్రత్యేక నిధులను ఆ కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యంగా వినియోగించాలని సీపీఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ డిమాండ్ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన రూ.కోటి నిధులను రూ.5 కోట్లకు పెంచాలని కోరారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు సీపీఎం జిల్లా కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించినట్లు గోపాలన్, బి. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేక నివాసితులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు నిర్మించుకున్నా, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.ప్రభుత్వ కాలనీలు అనాథలుగా మిగిలిపోకుండా, ప్రత్యేక అభివృద్ధి నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను సీపీఎం నేతలు కోరారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా,