పోలింగ్ నాడు ఆగని నగదు పంపిణీ..!
-- మందకొడిగా సాగిన పోలింగ్
-- నగర ఓటర్లలో కానరాని ఉత్సాహం
-- పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున బారికేడ్ల నిర్మాణం
-- ప్రధాన రహదారులపైనే కంచెల ఏర్పాట్లు
-- వీధి రహదారులు పూర్తిగా దిగ్బంధనం
-- యంత్రాంగం అత్యుత్సాహం- అవస్థలు పడ్డ ప్రజలు
శ్రీకాకుళం- మేజర్ న్యూస్ ప్రతినిధి:
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్ల నుండి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదని చెప్పవచ్చు. జిల్లా కేంద్రం కావడంతో ఉద్యోగులు విద్యావంతులు అధికంగా ఉండే కార్పొరేషన్ పరిధిలో సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరగవచ్చు అన్న అంచనాలకు భిన్నంగా ఉండడం చూస్తుంటే నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై వీరికి ఎటువంటి అవగాహన లేదేమో అనిపించక మానదు. సాయంత్రం 6 గంటలకు అందిన అధికారిక సమాచారం ప్రకారం కేవలం 49 శాతం మాత్రమే ఓట్లు పోలవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఏమో! 180 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1,57,545 మంది ఓటర్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నారు. చివరి క్షణం వరకు పోలింగ్ను బహిష్కరించిన కుశలపురం గ్రామస్తులు మేయర్ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్నారు. తగ్గిన పోలింగ్ ప్రభావం ఎవరిపై పడుతుందన్న ఆందోళన ఇరువర్గాల శిబిరాల్లోనూ గుబులు రేపుతోంది.
పోలింగ్ రోజు ఆగని నగదు పంపిణీ:
ప్రచారం ఆగిన మరుక్షణం నుండి మొదలుపెట్టిన నగదు పంపిణీ ప్రలోభాల కార్యక్రమం పోలింగ్ రోజు ఉదయం వరకు కూడా కొనసాగడం, డబ్బులు అందని ఓటర్లు చోటా నాయకులను నిలదీయడం పలు పోలింగ్ కేంద్రాల్లోని ఆయా పార్టీల శిబిరాల వద్ద దర్శనం ఇచ్చిన సాధారణ దృశ్యాలుగా మారాయి. వార్డుల్లో నాయకుల అవతారం ఎత్తిన కొందరు దళారులు ఎవరికి అందిన మొత్తాన్ని వారు నొక్కేయడంతో వార్డుల్లో పూర్తిస్థాయిలో పంపకాలు జరగకపోవడం కారణంగా మిగిలిన వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన దృశ్యాలు కోకొల్లలు. డబ్బులు అందని కొందరు ఓట్లు వేసేందుకు నిరాకరించడం కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి బలమైన కారణంగా చెప్పుకోవచ్చని కొందరు నగర వాసులు అభిప్రాయపడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు మించి ఏర్పాట్లు:
సాధారణ సార్వత్రిక ఎన్నికల మించి ఒక నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడం యంత్రాంగం అచ్యుత్సాహమేనని నగర ప్రజలు ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నారంలో శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడంలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బద్ధత చర్యల్లో భాగంగా ప్రధాన రహదారులపై ముల్లకంచెలు, భారీకేళ్ళు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వీధుల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో వీధి రహదారులను పూర్తిగా మూసేయడంతో ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు కూడా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు నగరంలో చాలా ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. మరోవైపు పక్కనే ఉన్న ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల్లో 75.2% ఓటింగ్ జరగడం ఆ ప్రాంత ప్రజల చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.