పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి.
అర్నబ్ తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
అనపర్తి, మేజర్ న్యూస్. అర్నబ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి, అంసూరి రాము, గుడాల గంగయ్య, దెయ్యాల సుబ్బారావులను పరామర్శించి, పంట నష్టం వివరాలు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎంతో కష్టపడి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు పంట నష్టాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.పంట నష్టాల అంచనాలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. నష్టపోయిన ప్రతి అర్హత కలిగిన రైతును గుర్తించి, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో పరిహారం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సత్తి రామారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), సత్తి సూర్య కళారెడ్డి తదితరులు పాల్గొన్నారు.