నగరపంచాయతీలో 8 మంది నామినేషన్లు దాఖలు
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం తొలిరోజే రసవత్తరంగా మారింది. శుక్రవారం నాడు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు మొత్తం 8 నామినేషన్లు దాఖలైనట్లు నగరపంచాయతీ కమిషనర్ టి. గోవిందరావు వెల్లడించారు. మొత్తం దాఖలైన 8 నామినేషన్లలో వార్డు సభ్యులుగా 6 గురు, చైర్మన్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
5వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరు నామినేషన్ దాఖలు చేశారు.
9వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
10వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు.
11వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
16వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరు నామినేషన్ దాఖలు చేశారు.
చైర్మన్ రేసులో ఊహించని పరిణామం..
ఈ నామినేషన్ల ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం చైర్మన్ స్థానానికి సంబంధించిన రాజకీయ పరిణామం. పొత్తులో భాగంగా నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించారు.
టీడీపీ నుంచి నామినేషన్:
కూటమి సీట్ల సర్దుబాటు ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున లెంక అప్పలనాయుడు చైర్మన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి అంగీకారానికి భిన్నంగా టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు కావడం రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.