మోడల్ సొసైటీగా అంబాజీపేట
మోడల్ సొసైటీగా అంబాజీపేట పీఏసీఎస్ ను తీర్చిదిద్దుతా
ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ సహకారంతో అభివృద్ధి చేస్తా.. చైర్ పర్సన్ సూరిబాబు
- అంబాజీపేట మేజర్ న్యూస్
స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి సహకారంతో అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మోడల్ సొసైటీగా తీర్చిదిద్దుతానని చైర్ పర్సన్ అరిగెల సూర్యనారాయణ మూర్తి (సూరిబాబు) తెలిపారు.అంబాజీపేట పీఏసీఎస్ నందు సోమవారం మహాజన సభ జరిగింది.ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పి.గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని, రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో రుణాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
అనంతరం సంఘ సీఈవో మద్దింశెట్టి నాగభూషణం జమాఖర్చుల వివరాలు వెల్లడించారు. ఎరువుల అమ్మకాల ద్వారా రూ.3,13,120 నికర లాభం వచ్చిందని తెలిపారు.చైర్ పర్సన్ సూరిబాబు మాట్లాడుతూ రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.సొసైటీని పారదర్శకంగా నడుపుతూ ప్రతి రైతుకు అందుబాటులో ఉంచుతామన్నారు.రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా మోడల్ సొసైటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.అనంతరం పి.గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ గా సియం చంద్రబాబు ఉత్తర్వులు అందుకున్న మోకా ఆనంద్ సాగర్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ అంబాజపేటలో అన్నా క్యాంటిన్ ఏర్పాటు కు కృషి చేస్తానని కూటమి నాయకులకు బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు గంగాధర్ రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు గణపతి వీరరాఘవులు, మాజీ ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, కొర్లపాటి కోటబాబు, సొసైటీ మాజీ అద్యక్షులు దొమ్మేటి సత్యమోహన్, అరిగెల బలరాంమూర్తి, భారత్ కిసాన్ సంఘ్ నాయకులు ముత్యాల జమీల్, పత్తి దత్తుడు రవణం రాము, జనసేన మండల అధ్యక్షుడు దొమ్మేటి సాయికృష్ణ, టీడీపీ నాయకులు మేడిది శ్రీను, నందంపూడి, తొండవరం, వాకలగరువు, అంబాజీపేట, మాచవరం రైతులు,సంఘ సిబ్బంది పాల్గొన్నారు.