రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కోనసీమ విద్యార్థుల ప్రభంజనం: అంబాజీపేట విద్యార్థినులకు స్వర్ణాలు.. జాతీయ స్థాయికి ఎంపిక!
సూర్య క్రీడా డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి వేదికగా ఈనెల 12, 13, 14 తేదీలలో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ముఖ్యంగా అంబాజీపేట పరిసర ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు పోరాట పటిమ కనబరిచి పలు విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
అండర్-14 బాలికల 20 కేజీల విభాగంలో అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కుడుపూడి కావ్య, సుందరి హరిప్రియ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే అండర్-14 బాలికల 38 కేజీల విభాగంలో తొండవరం హైస్కూల్ విద్యార్థిని మంద మౌనిక రజత పతకం (సిల్వర్ మెడల్) గెలుచుకుంది. బాలుర విభాగంలో అండర్-17 కేటగిరీ 41 కేజీల విభాగంలో స్థానిక సెంట్ మేరీ హైస్కూల్ విద్యార్థి బైరిశెట్టి హేమ రితిక్ కాంస్య పతకం (బ్రాంజ్ మెడల్) సొంతం చేసుకున్నాడు.
రాష్ట్రస్థాయి పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన కుడుపూడి కావ్య, సుందరి హరిప్రియ వచ్చే నవంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి పి. త్రిమూర్తులు వెల్లడించారు.
రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన విజేతలతో పాటు జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారిణులను స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, మండల విద్యాశాఖాధికారి మోకా ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు కె. సాయిరాం, కోచ్లు టి. రాజశేఖర్, డి. రాఘవేంద్ర మరియు తోటి క్రీడాకారులు ఘనంగా అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.