andhrapradesh
ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన
అవనిగడ్డ, మేజర్ న్యూస్: భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంటల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో సోమవారం అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయన మందుల వినియోగం వల్ల నేల కలుషితమవుతోందని, భూసారం దెబ్బతినకుండా జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని సూచించారు. జీవ ఎరువుల వినియోగంతో పాటు భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని తెలిపారు. రబీ సాగుకు ముందస్తు చర్యలు, సమగ్ర కలుపు యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు.
అనంతరం అవనిగడ్డలో చిరు సంచుల దశలో సాగు చేస్తున్న బీపీటీ 3372, ఆర్జీఎల్ 7038 నూతన వరి వంగడాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. వాటి ఎదుగుదల, పురుగులు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం తదితర అంశాలను అధ్యయనం చేసింది. రైతు స్థాయిలో పరిశీలన, అనుభవాల నమోదు అనంతరమే నూతన వంగడాల విడుదలకు సిద్ధం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఏడీఏ జయప్రద, కేవీకే శాస్త్రవేత్తలు కృష్ణవేణి, డాక్టర్ రేవతి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు తేజశ్రీ, రైతులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.