కడియంలో తొలిరోజు ఒకే నామినేషన్ దాఖలు నామినేషన్ల ప్రక్రియకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
కడియం, మేజర్ న్యూస్,:కడియం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కడియపులంక-2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూపాటి దుర్గాప్రసాద్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
తొలిరోజు ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన స్థానాలకు ఎవరూ నామినేషన్లు సమర్పించలేదని అధికారులు తెలిపారు.
కడియం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు సమర్పించేలా అధికారులు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
రానున్న రోజుల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో ఎన్నికల కార్యాలయం వద్ద సందడి పెరిగే అవకాశముంది.మరోవైపు, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.