జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నెల్లూరు, మేజర్ న్యూస్ :
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను కూడా ప్రకటించినట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నవంబర్ 5వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్, నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోందని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా స్థాయి అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, రాత్రింబవళ్లు కష్టపడి తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. నవంబర్ 1వ తేదీన జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.