ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే 136 వ వర్ధంతి
లక్క వరపు కోట నవంబర్ 28 మేజర్ న్యూస్ : నవంబర్ 28న మహాత్మా జ్యోతిబాపూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని జమ్మదేవిపేట గ్రామం పరిధిలో గల మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ యు. విజయ్ కుమార్ పాత్రో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొని జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబాపూలే కులవ్యవస్థకు వ్యతిరేకంగా, అణచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్ముడిగా గుర్తింపు పొందిన జ్యోతిబాపూలే స్త్రీ విద్య అభివృద్ధికి విశేష కృషి చేశారని, మహిళల విద్య కోసం అనేక పాఠశాలలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ఆయన ఆశయాలు, సేవలు విద్యార్థినులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.