ఎరువుల యాప్ విధానంలో రైతుల ఇబ్బందులు తొలగించాలి
ఎరువుల యాప్ విధానంలో రైతుల ఇబ్బందులు తొలగించాలి
– ఆఫ్‌లైన్ విధానాన్ని కొనసాగించాలి
--యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టలేక రైతాంగంపై ఆంక్షలా
--రైతుసంఘ నేత లక్కు ప్రసాద్
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఎరువుల సరఫరా యాప్ విధానంలో రైతుల ఇబ్బందులు తొలగించాలని, ఆఫ్ లైన్ విధానం కొనసాగించాలని, యూరియా బ్లాక్ మార్కెట్ అరికట్టలేక రైతాంగం పై ఆంక్షలు సరికాదని జిల్లా రైతుసంఘ సంయుక్త కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శనివారం స్థానిక సిండికేట్ రైతు సేవా సహకార సంఘ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, ఎం డి శ్రీనివాసరావు లను కలిసి ఎరువుల పంపిణీలో రైతుల ఇబ్బందుల గురించి చర్చించారు. ఈ సందర్బంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూనిరక్షరాస్యులు, పేద రైతులు, కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని,రైతు సంఘాలతో చర్చించి సరళమైన విధానం రూపొందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా, ఎరువుల పంపిణీ పేరుతో కొత్త యాప్ విధానాన్ని ప్రవేశపెట్టి అనేక కఠినమైన నిబంధనలు విధించడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం, సబ్సిడీ ఎరువులు పక్కదారి పట్టకుండా నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత అని,అయితే కొంతమంది బ్లాక్ మార్కెట్ వ్యాపారులను నియంత్రించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవన్నట్లు రాష్ట్రంలోని మొత్తం రైతాంగాన్ని డిజిటల్ ఆంక్షల పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని రైతు సంఘం నేత ప్రశ్నించారు .
స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం లేని పేద రైతులు యాప్‌లో నమోదు చేసుకోవడం, ఎరువుల బుకింగ్ చేయడం, క్యూ ఆర్ కోడ్ పొందడం వంటి ప్రక్రియలను ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు . వీరికి సహాయక వ్యవస్థ లేకుండా డిజిటల్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు . భూమి యజమానులు వేరుగా, వాస్తవంగా వ్యవసాయం చేసేవారు వేరుగా ఉన్నారన్నారు . భూమి యాజమాన్య పత్రాలు లేని కౌలు రైతులకు డిజిటల్ రికార్డుల్లో పేర్లు లేకపోతే ఎరువులు ఎలా అందుతాయని ప్రశ్నించారు.ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు ఈ విధానం మరిన్ని సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎరువుల పంపిణీలో కౌలు రైతులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
బయోమెట్రిక్ ధృవీకరణలో యూ ఐ డి _అతేంటికేషన్ _ఫెయిల్డ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వృద్ధ రైతుల వేలిముద్రలు సరిగా పడకపోవడం, ఇంటర్నెట్, సర్వర్ సమస్యల వల్ల ఎరువుల కొనుగోలు నిలిచిపోతున్నదని తెలిపారు . సాంకేతిక సమస్యలకు రైతులను బాధ్యులను చేయడం సరికాదని, ప్రత్యామ్నాయ గుర్తింపు విధానం ద్వారా ఎరువులు అందించాలని కోరారు.
భూమి విస్తీర్ణం, పంట నమోదు ఆధారంగా ఎరువుల పరిమాణాన్ని నిర్ణయించడం వల్ల వాస్తవంగా సాగు చేస్తున్న రైతుల అవసరాలు తీరకపోవచ్చని, నేల స్వభావం, పంట దశ, సాగు విధానం, నీటి వసతి ఆధారంగా ఎరువుల అవసరాలు మారుతాయని, కేవలం డిజిటల్ రికార్డుల ఆధారంగా ఎరువుల కేటాయింపుపై పరిమితులు విధించకూడదని స్పష్టం చేశారు.
బుకింగ్ చేసిన 48 గంటల్లో ఎరువులు కొనుగోలు చేయాలనే నిబంధన, రైతు ఎంపిక చేసుకున్న దుకాణంలో ఎరువుల నిల్వలు లేకపోతే ఎదురయ్యే సమస్యలు, యాప్ పనిచేయని సందర్భాల్లో కొనుగోలు నిలిచిపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
రైతు సంఘం ప్రధాన డిమాండ్లు
ఎరువుల పంపిణీలో డిజిటల్ విధానంతో పాటు గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్ విధానాన్ని కొనసాగించాలి.
యూరియా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా, తనిఖీలు, కఠిన చర్యలు చేపట్టాలి. దాని కోసం మొత్తం రైతాంగంపై ఆంక్షలు విధించకూడదు.
స్మార్ట్‌ఫోన్లు లేని నిరక్షరాస్య, వృద్ధ రైతులకు ప్రత్యామ్నాయంగా ఎరువులు అందించాలి.
కౌలు రైతులకు సాగు ఆధారంగా ఎరువులు పొందే హక్కు కల్పించాలి.
బయోమెట్రిక్ విఫలమైనా ప్రత్యామ్నాయ గుర్తింపు ద్వారా ఎరువులు అందించాలి.
భూమి విస్తీర్ణం, పంట నమోదు ఆధారంగా ఎరువులపై అనవసర పరిమితులు విధించకూడదు.
48 గంటల బుకింగ్ గడువుపై రైతులకు తగిన వెసులుబాటు కల్పించాలి.
రైతు తనకు అనుకూలమైన ఎరువుల విక్రయ కేంద్రంలో కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలి.
యాప్, సర్వర్, ఇంటర్నెట్ సమస్యల వల్ల ఎరువుల పంపిణీ నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
రైతు సేవా కేంద్రాల్లో ఉచిత బుకింగ్ సహాయ సిబ్బందిని నియమించాలి.
ఎరువుల సరఫరాలో ఉన్న సమస్యలు, ప్రత్యామ్నాయ పంపిణీ మార్గాలపై రైతు సంఘాలు, రైతు ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపాలి.
రైతులతో చర్చించి రైతులకు అనుకూలమైన విధానం రూపొందించాలి
ప్రభుత్వం ఎరువుల సరఫరాలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలి. ఎరువుల కొరతకు, బ్లాక్ మార్కెట్‌కు కారణమవుతున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించకుండా యాప్‌లు, బయోమెట్రిక్, క్యూ ఆర్ కోడ్‌లతో రైతులను నియంత్రించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని రైతు సంఘం పేర్కొంది.
రైతులకు ఎరువులు సకాలంలో, సులభంగా అందించేందుకు గతంలో ఉన్న సరళమైన పంపిణీ విధానాలను కొనసాగిస్తూ, అవసరమైన సాంకేతిక సదుపాయాలను అదనంగా కల్పించాలి. ఈ విధానంపై రైతు సంఘాలు, రైతులతో ప్రభుత్వం బహిరంగ చర్చ జరిపి, వారి అభిప్రాయాల ఆధారంగా రైతులకు ఇబ్బందులు లేని సరళమైన ఎరువుల పంపిణీ వ్యవస్థను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు .
సాంకేతిక పరిజ్ఞానం రైతులకు సేవ చేయాలి తప్ప, రైతులను ఇబ్బందులకు గురిచేసే ఆంక్షల సాధనంగా మారకూడదు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులను నియంత్రించలేకపోతే అందుకు మొత్తం రైతాంగాన్ని బాధ్యులను చేయడం తగదు. రైతులకు ఎరువులు అందించడం ప్రభుత్వ బాధ్యత. రైతులపై ఆంక్షలు కాదు, రైతులకు అందుబాటులో ఉండే సరళమైన పంపిణీ విధానం కావాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందని
నెల్లూరు జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి
లక్కు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.