బిసి రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై వైద్య బృందం పర్యవేక్షణ
బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై వైద్య బృందం పర్యవేక్షణ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు యూ పి హెచ్ సి పరిధిలోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను డాక్టర్ సాయి ప్రసన్న శనివారం సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఏవైనా అనారోగ్య సంబంధిత ఫిర్యాదులు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స మరియు మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని, వైద్యుల సూచనలను పాటించాలని డాక్టర్ సాయి ప్రసన్న సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని కళాశాల సిబ్బందికి తెలిపారు.ఈ సందర్భంగా ఎన్ వి బి డి సి పి కార్యక్రమం కింద కీటకజనిత వ్యాధులపై విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి నిర్మూలించడం, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, ప్రతిరోజూ శుభ్రంగా ఉండటం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన నీటిని వినియోగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో హెచ్ ఈ వో ఎస్. సుధాకర్ , హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి , శ్రీరాములు , ఏ ఎన్ ఎం సుభాని బేగం , ఆశా కార్యకర్తలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి అవసరమైన సేవలను అందించడంతో పాటు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తుకు పునాది. ఆరోగ్యకరమైన అలవాట్లు, పరిశుభ్రమైన పరిసరాలు, సకాలంలో వైద్య సేవలు ప్రతి విద్యార్థికి ఎంతో అవసరం అని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు.