భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి
*స్నేహిత అమృత హస్తం సేవాసమితి భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మునిసిపల్ ఇన్‌చార్జ్ వై.ఎస్. మనోహర్ రెడ్డి*
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల పట్టణంలోని 100 అడుగుల రోడ్డులో జగనన్న కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న స్నేహిత అమృత హస్తం సేవాసమితి నూతన భవన నిర్మాణ పనులను వైకాపా మునిసిపల్ ఇన్‌చార్జ్ వై.ఎస్. మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిశోర్ లతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పురోగతి, నాణ్యత, భవిష్యత్తులో నిర్వహించనున్న సేవా కార్యక్రమాల గురించి సేవాసమితి ప్రతినిధులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ, సంస్థకు సొంత భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం ఉచిత విద్యా కార్యక్రమాలు, నేత్రదాన సేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలు, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజ సేవకు అంకితమైన ఈ భవనం ద్వారా వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మరింత మంది దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వై.ఎస్. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి విద్య, వైద్య,ఆరోగ్యం, నేత్రదానం, రక్తదానం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. సంస్థకు సొంత భవనం నిర్మాణం పూర్తయితే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడతాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. “మన సొంత భవనం” నిర్మాణం పూర్తయిన అనంతరం ఇది పులివెందుల ప్రాంత ప్రజలకు ఒక ముఖ్యమైన సామాజిక సేవా కేంద్రంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.