అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం -జూనియర్ సివిల్ జడ్జి బి. జ్యోత్స
ఆమదాలవలస, సూర్య : అర్హులైన వారందరికి ఉచిత న్యాయ సహాయం అందుతుందని జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్ పర్సన్ బి.రమ్య తెలిపారు. స్ధానిక కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మీబాయి అధ్యక్షతన న్యాయ సేవా దినోత్సవం సోమవారం ఏర్పాటు చేసిన కక్షిదారుల అవగాహన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికి సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్ధిక కారణాలు మూలంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసమే ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 "ఏ" జతచేసి న్యాయసేవల అధికారికుల చట్టం 1987 రూపొందించారని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం అర్హులైన వారందరికి ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలియజేసారు. చట్టం ముందు అందరూ సమానమే అని, వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా వివక్ష చూపరాదని, ప్రతి ఒక్కరని గౌరవించాలని హితవు పలికారు. ఈ సదస్సులో ఏజీపీ పైడి వరాహ నరసింహులు, మాజీ ఏజీపీ సీపాన గోవిందరావు న్యాయవాదులు తమ్మినేని అన్నంనాయుడు, ఎస్.ప్రసాదరావు, బి.మోహనరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.