ఆత్మకూరుటిడిపిఖాతాలోకి 10వ వార్డు
ఆత్మకూరులో టీడీపీ ఖాతాలోకి 10వ వార్డు
--ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థిని అరిటాకుల కృష్ణవేణి
--మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో తొలి విజయంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు పురపాలక సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయపరంపరకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు టీడీపీ ఖాతాలో చేరింది.బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం 10వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అరిటాకుల కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.ఆత్మకూరు పురపాలక ఎన్నికల పోరులో తొలి విజయాన్ని నమోదు చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ వ్యూహాలు, సమర్థవంతమైన నాయకత్వంలో 10వ వార్డును ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడిందనే అభిప్రాయాలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 10వ వార్డులో టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆత్మకూరు రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది.28 వార్డుల ఆత్మకూరు మున్సిపాలిటీలో తొలి వార్డు ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో చేరడంతో మిగిలిన వార్డుల్లోనూ విజయం సాధించాలనే ఉత్సాహం కూటమి నాయకులు, కార్యకర్తల్లో మరింత పెరిగింది.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు పురపాలక సంఘంలో ఎన్డీఏ కూటమి అపూర్వ విజయకేతనం ఎగురవేస్తుందనే ధీమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.