ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్*
*రూ.55 కోట్లతో గోపవరంలో 220/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం*
*ఎల్ నినోలోనూ ప్రజలకు ఇబ్బందులు రానివ్వం*
*వైసీపీ చర్యలతో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం*
- *ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్*
సూర్య, స్టేట్ బ్యూరో :
ఆక్వా రైతులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం, గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సోమవారంనాడు మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ... గోపవరం సబ్‌స్టేషన్‌తో కైకలూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా 8,500 మందికి పైగా ఆక్వా వినియోగదారులు, 54 వేల కుటుంబాలు, 8,500 మంది వాణిజ్య వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
ముఖ్యంగా ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకే ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే సబ్సిడీపై అందిస్తున్నామని, ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్ నినో తో డిమాండ్ పెరిగినా... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
*మౌలిక వసతులజ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి...*
ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. రూ.6 వేల కోట్లతో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.180 కోట్లతో 26 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు పనులు చేపడుతున్నామన్నారు. సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేసి లో-వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
రానున్న వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.50 కోట్లతో రీకండక్టరింగ్ పనులు చేపడుతున్నామన్నారు. త్వరలో కొప్పాక, బంటుమిల్లి, ఉండి, పెనుకొండలో 220 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామన్నారు.
పీక్ అవర్స్‌లో అవసరమైతే తక్కువ ధరకే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రైతులకు 24 గంటలూ నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
*6 నెలలకు ఒకసారి విద్యుత్ చార్జీల పెంపు...*
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించలేదని మంత్రి విమర్శించారు. 2014-19లో అసంపూర్తిగా మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణాలను కూడా ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పూర్తి చేయలేదన్నారు. ఒక్కసారి ఓటేసినందుకు విద్యుత్ వ్యవస్థను జగన్ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక రూపంలో పెంచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచకుండా ట్రూ-డౌన్ చేసిందని తెలిపారు.
సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని సబ్సిడీతో సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ ప్రత్యామ్నాయంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నేతలు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.