|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 08:22 PM
మన సమాజంలో చాలా మంది విద్యార్థులుకు లెక్కల సబ్జెక్ట్ అంటేనే భయం. చదవకుండానే... అర్థం చేసుకోకుండానే ఫెయిల్ అవుతామని భయపడతారు. ప్రతి ఏటా పది, ఇంటర్ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతోంది కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్‌లోనే. మ్యాథ్స్ పరీక్ష అంటేనే మరీ ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు భయంతో వణికిపోతుంటారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కేవలం 60 మార్కులకే మ్యాథ్స్ పరీక్ష నిర్వహించబోతున్నారు. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతుంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు... విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి, భారాన్ని తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాథమెటిక్స్ పరీక్షా సిలబస్, విధానంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మ్యాథ్స్ పేపర్ అంటే 75 మార్కులకు రాత పరీక్ష ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం మారనుంది. మ్యాథ్స్ పరీక్ష కోసం... సీబీఎస్‌ఈ మాదిరి మన దగ్గర కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది.
ప్రస్తుతం ఇంటర్‌లో మ్యాథ్స్–ఏ, మ్యాథ్స్–బీ రెండు పేపర్లకు చెరో 75 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రం తెలంగాణలో ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష కేవలం 60 మార్కులకే జరగనుంది. ఇది కూడా థియరీ పార్ట్. మిగిలిన 15 మార్కులను ‘ఇంటర్నల్స్’కు కేటాయించనున్నారు. విద్యార్థి సామర్థ్యం, ప్రాజెక్టులు, అటెండెన్స్ వంటి అంశాల ఆధారంగా ఇంటర్నల్స్‌లో ఈ 15 మార్కులు వేస్తారు.
దీంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ ఒకేలా ఉంది. రెండు పేపర్లకు వచ్చే 150 మార్కులను శాతంగా తీసుకొని వంద మార్కులకు కుదించారు. ఇకపై ఈ విధానానికి చెక్ పడనున్నది. ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్‌ను వంద మార్కులకు నిర్వహించనున్నారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించనున్నారు.
అలానే ఇంటర్ పరీక్షల విధానంతో పాటు సిలబస్‌లో కూడా భారీ మార్పులు చేయబోతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు... మ్యాథ్స్ బీలోనే ఫెయిల్ అవుతున్నారు. దీన్ని గమనించిన ఇంటర్ బోర్డు... మ్యాథ్స్ బీ పాఠ్య పుస్తకంలోని కొన్ని కఠినమైన చాప్టర్లను మ్యాథ్స్ ఏలోకి మార్చాలని డిసైడ్ అయింది. ఈ మార్పులన్నీ వచ్చే విద్యా సంవత్సరం (2026–27) నుంచే పక్కాగా అమలు కానున్నాయి.