|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 01:11 PM
తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రహదారికి సంబంధించిన అలైన్‌మెంట్ దాదాపుగా ఖరారైంది. ఈ నూతన మార్గం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం నాలుగున్నర గంటలు పడుతున్న ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలకు తగ్గిపోతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఇది సాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుకుంటుంది. అక్కడి నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. దీని ప్రకారం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి దూరం 211 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుత మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ.