ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి మంత్రి పొన్నం సవాల్
ఓటు హక్కు కోల్పోయిన వారందరినీ తీసుకొస్తా.. తేదీ, సమయం చెప్పండి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుందామని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తే ప్రజాస్వామ్యానికి మేలు జరిగేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కానీ ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనలను తప్పుబడుతూ, ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రశ్నించడం సరికాదని అన్నారు. సర్ పై తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలి అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కి నా సవాలు
మీరు తేదీ, సమయం చెప్పండి. పోలీస్ ఫోర్స్ పెట్టుకొని అరెస్టులు చేయించడం కాదు. ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న బాధితులను, వారి ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొస్తాను. రాంచందర్ రావు మా సవాల్‌ను స్వీకరించి తేదీ, సమయం ప్రకటించాలి. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను మీ ముందుకు తీసుకొస్తాం.
ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులపై ఎన్నికల రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వివరించండి. నా ఓటుతో సహా, నా తండ్రి పేరు సత్తయ్య, సత్యనారాయణ గౌడ్ వంటి పేర్లలో ఉన్న వ్యత్యాసాలను సాకుగా చూపి నేను ఆధారాలు చూపేకపోతే నా ఓటు తొలగించే ప్రయత్నం జరిగింది.. అర్హులైన వారి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగితే వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు, ఎన్నికల వ్యవస్థకు ఉంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి. దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు పోయాయి.. రాష్ట్ర రాజధాని లోనే 40 లక్షల ఓట్లు కోల్పోయాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సవరణ పేరుతో తొలగి పోయాయి. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదు. ఓటర్ల జాబితా సవరణ అనేది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఎన్ని ఓట్లు తొలగించారు? వాటిలో అనర్హులైనవారి ఓట్లు ఎన్ని? అర్హులైనవారి ఓట్లు పొరపాటున తొలగించబడ్డాయా? అనే అంశాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలి. ముఖ్యంగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లు తోలగించబడ్డాయి..
పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ ఇతర ఆధారాలు సమర్పించాలని కోరితే, సాధారణ ప్రజలు తమ హక్కును ఎలా కాపాడుకోవాలో ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేయాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉదంతమే ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఓటరు తన గుర్తింపును నిరూపించుకోవడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో అన్నారు.. ఓటరు నమోదు, ఆధారాల సమర్పణ అంశంపై వచ్చిన ఇంటర్వ్యూ వివరాలను కూడా పరిశీలించాలి. సామాన్య ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదు. ఓటు హక్కు అనేది కేవలం ఒక గుర్తింపు కాదు. అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాలి. కానీ ఆ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలు ప్రశ్నిస్తే వారిని కించపరిచే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం నిలబడాలి.
అర్హులైన ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదన్నదే మా డిమాండ్. ఓటు తొలగినవద్దని ఉద్యమం చేస్తున్న వారిని అవమానించడం తగదు. ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం. అందుకే “ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - రాజ్యాంగాన్ని కాపాడండి” అనే నినాదంతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది అని మంత్రి పొన్నం పేర్కొన్నారు