నెల 30న సీఎం చేతుల మీదుగా పండుగ వాతావరణంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం..
పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి..
ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్ కార్యాలయం సుందరంగా ముస్తాబు చేయాలి..
సీఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి..
అన్ని శాఖలు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలి..
రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, సెప్టెంబర్ 24: కరీంనగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంతో పాటు కార్యాలయ భవనాన్ని సుందరంగా అలంకరించాలని, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా భవనం పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రధాన ద్వారం, కలెక్టర్ కార్యాలయం, ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలతో పాటు ఇతర ముఖ్య ప్రాంగణాలను సుందరంగా అలంకరించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రతి ప్రాంతంలో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణం పరిశీలన
సమీక్ష అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించారు. కలెక్టర్ నూతన ఛాంబర్, సమావేశ మందిరంతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక కోసం నూతనంగా నిర్మించిన హెలిప్యాడ్‌ను కూడా మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో చేరుకున్న తర్వాత కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం నూతన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.