జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం
వికారాబాద్/తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ క్యాంపు కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. జిల్లాల ఏర్పాటు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.