88 పరుగులతో ధ్రువ్ జురెల్ చరిత్ర.. న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు నమోదు
సూర్య స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించారు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా సాగుతున్న ఈ పోరులో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జురెల్, జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న వేళ 170 బంతుల్లో 88 పరుగులు సాధించి అరుదైన మైలురాయిని అందుకున్నారు. న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా జురెల్ నిలిచారు.
గతంలో 2014లో వెల్లింగ్టన్ టెస్టులో అజింక్య రహానే చేసిన 118 పరుగులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, తాజా ఇన్నింగ్స్‌తో 88 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ రెండో స్థానానికి చేరుకున్నారు. తద్వారా 1981లో ఆక్లాండ్‌లో సయ్యద్ కిర్మాణి నమోదు చేసిన 78 పరుగుల రికార్డును జురెల్ అధిగమించారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌లో టెస్టు ఇన్నింగ్స్‌లలో ఏడో స్థానం లేదా అంతకంటే కింద బ్యాటింగ్ చేసి పలుమార్లు అర్ధశతకాలు సాధించిన మూడో భారతీయ ఆటగాడిగానూ నిలిచారు.
ఈ జాబితాలో జురెల్‌కు ముందు కిరణ్ మోరే, ఎంఎస్ ధోనీ మాత్రమే ఈ ఘనత సాధించారు. తొలి టెస్టులోనూ 78 పరుగులతో రాణించిన ధ్రువ్ జురెల్, ప్రస్తుత సిరీస్‌లో తన రెండో అర్ధశతకాన్ని నమోదు చేసి సెనా దేశాల గడ్డపై తొలి టెస్టు యాభై పరుగుల మార్కును అందుకున్నారు. కైల్ జేమీసన్ బౌలింగ్‌లో బౌండరీతో అర్ధశతకం పూర్తి చేసుకున్న జురెల్, తన ప్రత్యేకమైన ఆర్మీ శైలి సెల్యూట్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేయగా, జవాబుగా బరిలోకి దిగిన భారత్ 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఫాలోఆన్ ముప్పులో పడింది. ఆ క్లిష్ట సమయంలో ఆకాశ్ దీప్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు, గుర్నూర్ బ్రార్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన జురెల్, జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించారు. జురెల్ పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.
Also Read: రవీంద్ర జడేజా రికార్డు బద్దలుకొట్టిన ఆకాశ్ దీప్.. రెండో టెస్టులో భారత్‌కు కీలక ఇన్నింగ్స్