ఉక్రెయిన్ డిజిటల్ వ్యవస్థలపై రష్యా క్షిపణి విరుచుకుపాటు
కీవ్‌లో లక్ష కుటుంబాలకు నిలిచిపోయిన ఇంటర్నెట్
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దళాలు జరిపిన డ్రోన్ దాడులు అక్కడ తీవ్ర డిజిటల్ సంక్షోభానికి దారితీశాయి. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగిన ఈ దాడుల్లో కీలకమైన డేటా సెంటర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావంతో కీవ్ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు లక్ష కుటుంబాలకు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక నిపుణుల బృందాలు రంగంలోకి దిగి నష్ట తీవ్రతను అంచనా వేస్తూ, నెట్‌వర్క్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అత్యవసర మరమ్మతు పనులు వేగవంతం చేశాయి.
డిజిటల్ మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా జరిపిన ఈ వైమానిక దాడులను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తీవ్రంగా ఖండించారు. సమాచార వ్యవస్థల ఉనికిని దెబ్బతీసి, పౌరులకు సకాలంలో రక్షణ హెచ్చరికలు అందకుండా చేయడమే రష్యా ప్రధాన వ్యూహమని ఆయన ఆరోపించారు. రష్యా క్షిపణి, డ్రోన్ దాడుల నుండి పౌరులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థ మరియు ఇంటర్నెట్ ఎంతో కీలకమని, అటువంటి కీలకమైన పౌర వ్యవస్థలపై దాడులు చేయడం వల్ల వేలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సైనిక లక్ష్యం ఎంతమాత్రమూ కాదని, సాధారణ ప్రజల జీవన విధానాన్ని స్తంభింపజేసే కుట్రలో భాగమని పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ సైనిక అవసరాలకు వినియోగిస్తున్న డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ మరియు గిడ్డంగులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కీవ్‌లోని రెండు కీలక డేటా సెంటర్లతో పాటు నల్లసముద్ర తీరప్రాంత ఓడరేవు నగరమైన ఒడెస్సాలోని రెండు సరఫరా కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. పవుతిన్ మరియు యుటెల్స్ వంటి ప్రముఖ ఇంటర్నెట్ సేవా సంస్థల సర్వర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో డిజిటల్ మరియు కమ్యూనికేషన్ మౌలిక వసతులపై ప్రత్యక్ష దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.