తూర్పు తీరం వైపు క్షిపణి...ఉద్రిక్తతలకు తెరతీసిన ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్
సూర్య అంతర్జాతీయ డెస్క్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఉత్తర కొరియా తమ తూర్పు తీరం వైపు ఒక గురుతు తెలియని క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం సోమవారం ప్రకటించింది. ఉత్తర కొరియా అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టిందని, అది అప్పటికే సముద్రంలో పడిపోయినట్లు భావిస్తున్నామని జపాన్ తీరప్రాంత రక్షణ దళం (కోస్ట్ గార్డ్) వెల్లడించింది. వరుస క్షిపణి పరీక్షలతో సరిహద్దుల్లో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం మరోసారి భయాందోళనలు రేకెత్తిస్తోంది.
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మైంగ్ నేతృత్వంలో ఆ దేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి ఒడిగట్టింది. కొరియా ద్వీపకల్పంలో ప్రాంతీయ ఆధిపత్యం, రక్షణ వ్యూహాల విషయంలో ఇరు దేశాల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో వరుస క్షిపణి పరీక్షలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఉత్తర కొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.
ఉత్తర కొరియా సైనిక చర్యను దక్షిణ కొరియా, జపాన్ డిఫెన్స్ అథారిటీలు తీవ్రంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ హఠాత్ ప్రయోగం వెనుక ఉన్న సాంకేతికతను, క్షిపణి ప్రయాణించిన దూరాన్ని విశ్లేషించేందుకు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అధ్యయనం చేస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి మిలిటరీ విన్యాసాలకు నిరసనగా, తమ అణు మరియు క్షిపణి సామర్థ్యాలను ప్రదర్శించేందుకే కిమ్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇలాంటి ప్రయోగాలు చేస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.