అమెరికాలో ఇక ‘లేక్ అమెరికా’గా ప్రదర్శించనున్న గూగుల్ మ్యాప్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు అనుగుణంగా గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 'లేక్ ఒంటారియో' సరస్సు పేరును అమెరికా వినియోగదారుల కోసం 'లేక్ అమెరికా'గా మారుస్తున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది.
కెనడాతో తీవ్రమవుతున్న వాణిజ్య వివాదం, బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులపై పరస్పర సుంకాల నేపథ్యంలో ఐదు ప్రముఖ ‘గ్రేట్ లేక్స్’లో ఒకటైన ‘లేక్ ఒంటారియో’ పేరును మారుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఉత్తర్వుల కారణంగా యూ.ఎస్. జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GNIS)లోని డేటా మారింది. గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చినప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ ఇదే విధంగా స్పందించింది.
ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో పాటు పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ సరస్సు ఒడ్డున "లేక్ ఒంటారియో: నౌ అండ్ ఆల్వేస్" అని రాసి ఉన్న ఫలకాన్ని ఆవిష్కరించి తమ నిరసన తెలిపారు. ప్రపంచం ఎప్పటికీ దీనిని లేక్ ఒంటారియోగానే పిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్, వెర్మాంట్ గవర్నర్లు సైతం ట్రంప్ చర్యను తప్పుబట్టారు.
మరోవైపు, ప్రభుత్వ ఏజెన్సీ వెబ్‌సైట్లు గూగుల్ మ్యాప్స్ డేటాను నేరుగా వాడుతుండటంతో కొన్ని చోట్ల 'లేక్ అమెరికా' అని ప్రత్యక్షమైంది. దీనిపై స్పందించిన ఒంటారియో ప్రభుత్వం, తమ సైట్లలో సరస్సు అసలు పేరు 'లేక్ ఒంటారియో'గానే కనిపించేలా సాంకేతిక సమీక్ష చేపడుతున్నట్లు తెలిపింది.