అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి
బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా
పూణె (మహారాష్ట్ర): ఢిల్లీలో స్లీపర్ బస్సులో చోటుచేసుకున్నట్లు ఆరోపించబడుతున్న సామూహిక అత్యాచార ఘటనపై బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో నైతిక, మేధోపరమైన పతనానికి ఈ ఘటన ఒక పెద్ద నిదర్శనమని ఆమె ఆవేదన చెందారు.
మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రధానితో సహా ప్రజాప్రతినిధులు యువత పురోగతికి అండగా నిలుస్తున్న తరుణంలో ఇలాంటి ఘోరాలు జరగడం బాధాకరమన్నారు. నేటి కాలంలో కూడా మహిళలు తమ రక్షణ, ఇలాంటి సంఘటనల గురించి చర్చించుకోవాల్సి రావడం కలచివేస్తోందని చెప్పారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నేరాలకు వ్యతిరేకంగా మరిన్ని కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి దారుణాలకు పాల్పడే రకస్యులకు ఎలాంటి సుదీర్ఘ విచారణలు, సుదీర్ఘ కోర్టు జాప్యాలు లేదా ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుల అవసరం లేదని, నేరం రుజువు కాగానే రద్దీగా ఉండే నడిరోడ్డుపై బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని నవనీత్ రాణా డిమాండ్ చేశారు. త్వరితగతిన పూర్తి చేసే విచారణ, వెంటనే ఇచ్చే బహిరంగ ఉరిశిక్ష మాత్రమే ఇలాంటి మృగాలకు సరైన బుద్ధి చెబుతుందని ఆమె స్పష్టం చేశారు.