వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం
మొక్కలు నాటి విద్యార్థుల్లో చైతన్యం
చేవెళ్ల, మేజర్ న్యూస్ (ఆగస్టు 31) : మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు (పామెన) శివారులో ఉన్న సంస్కృతి పాఠశాలలో సోమవారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజా ఆగిరెడ్డి, దావల్ గోపాల్ రెడ్డి, మంగలి కళ్యాణి యాదగిరి, అత్తెల్లి మనీషా అనంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందితే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహానా, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎర్ర గోపాల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గౌడ్ల యాదయ్య, బ్యాగరి విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.