ఎఫ్-35 విమానం దగ్గరకు కూడా రానివ్వరు.. కానీ అమ్ముతామంటారా?: అమెరికా కమాండర్ సమక్షంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సూటి వ్యాఖ్యలు!
సూర్య రక్షణ & అంతర్జాతీయ డెస్క్: భారత్‌కు అత్యాధునిక ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాల విక్రయంపై వస్తున్న ఊహాగానాలకు భారత వాయుసేన (IAF) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ స్పష్టతనిచ్చారు. భారత్‌కు ఎఫ్-35 ఫైటర్ జెట్లను విక్రయించే విషయమై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని ఆయన తేల్చిచెప్పారు.
జోధ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ (US PACAF) కమాండర్‌తో కలిసి పాల్గొన్న సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మీ వాళ్ళు మమ్మల్ని కనీసం ఆ విమానం దగ్గరకు కూడా వెళ్లనివ్వరు.. అలాంటిది మాకు అమ్ముతామని ఎలా మాట్లాడతారు?" అంటూ సరదాగా చురకలు అంటిస్తూనే వాస్తవ పరిస్థితిని కుండబద్దలు కొట్టారు.
మరోవైపు, రష్యా ప్రతిపాదించిన సుఖోయ్-57 (Su-57) స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుపై కూడా ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. భారత వైమానిక దళ అవసరాలు, దేశీయ భద్రతా వ్యూహాలు, స్వదేశీ రక్షణ తయారీ రంగం (ఆత్మనిర్భర్ భారత్) ప్రాధాన్యతలను బేరీజు వేసుకుంటూనే భవిష్యత్ యుద్ధ విమానాల ఎంపిక ఉంటుందని రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.