'సూపర్ ఇంటెలిజెన్స్' దెబ్బకు కాల్ సెంటర్ ఉద్యోగాలు కనుమరుగు: ఎలాన్ మస్క్ సంచలన జోస్యం!
సూర్య టెక్నాలజీ & అంతర్జాతీయ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా కాల్ సెంటర్ ఉద్యోగాలు అత్యంత వేగంగా కనుమరుగవుతాయని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో కాల్ సెంటర్ల ఉపాధి అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయన్న నివేదికపై స్పందించిన ఆయన, 'సూపర్ ఇంటెలిజెన్స్' (SI) రాకతో ఈ ఉద్యోగాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని పేర్కొన్నారు.
గత 15 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కాల్ సెంటర్ రంగంలో ఏటా సుమారు 4 శాతం చొప్పున ఉద్యోగాల వృద్ధి నమోదు కాగా, ప్రస్తుతం ఏఐ రాకతో అంతే వేగంతో ఆ ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దీనిపై 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన మస్క్.. "ఎస్‌ఐ (సూపర్ ఇంటెలిజెన్స్) కారణంగా కాల్ సెంటర్ ఉద్యోగాలు చాలా వేగంగా అదృశ్యమవుతాయి" అని విశ్లేషించారు.
కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. కస్టమర్ కేర్, వాయిస్ అసిస్టెంట్ విభాగాల్లో అధునాతన ఏఐ బాట్‌లు మరియు ఆటోమేషన్ వ్యవస్థల వినియోగం పెరగడంతో కాల్ సెంటర్ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.