చక్రయాత్ర - విజయదశమి దర్శనం - 10 రాజరాజేశ్వరీ దేవి - విజయానికి ప్రతీక (శమీ పూజ - పాలపిట్ట - దసరా అంతరార్థం)
చక్రయాత్ర - విజయదశమి దర్శనం - 10
రాజరాజేశ్వరీ దేవి - విజయానికి ప్రతీక
(శమీ పూజ - పాలపిట్ట - దసరా అంతరార్థం)
:రాజరాజేశ్వరీ దేవి ప్రార్ధనా శ్లోకం:
దేవ్యై శ్రీ రాజరాజేశ్వర్యై నమః
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంచేస్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు.. చల్లని చూపుల తల్లి కరుణ కోసం పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక భవాని దీక్షాపరులు దుర్గ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు
దసరా వచ్చిందయ్యో సరదా తెచ్చిందయ్యో -
తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలోరాష్ట్ర పండుగ ఐన ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.బొమ్మల కొలువులు, బతుకమ్మ పాటలు, ప్రకృతి లో ఆటలు, అయ్యవార్లకిచ్చే అయిదు వరహాలు, పిల్లలకు పంచే పప్పు బెల్లాలు, పాలపిట్టను చూసేందుకు ఊరిబైటకి వెళ్ళటం, శమీచెట్టు దర్శనాలు, పరస్పర ఆలింగనలతో పంచుకునే ‘బంగారాలు’ అనే జమ్మి ఆకులూ, గంగిరెద్దులు, పులివేషాలు, డప్పులమోతలు, సాముగరిడీలు....దసరా చిహ్నాలు.
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం కూడ ఆనవాయితీ .
దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలైన బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో దసరా వేడుకల్ని పార్వతీదేవి పుట్టింటికి రావడంగా జరుపుతారు. తమ ఇంటికి వచ్చిన ఆడపడుచును సప్తమి, అష్టమి, నవమి రోజుల్లోఅర్చించిదశమినాడుసాగనంపుతారు . ఆ సందర్భంగా స్త్రీలు పాడే పాటల్ని ‘ఆగమ గీతికలు’ అంటారు. గుజరాతులో దసరాకు దాండియా నృత్యం చేయడం సంప్రదాయం. విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే అదో శుభశకునం, ఇక భవిష్యత్తులో అంతా శుభమే జరుగుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు. రాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ’ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు..శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది.
ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి. హిందూ పురాణాల ప్రకారం రావణాసురుడిని చంపేందుకు వెళ్లిన శ్రీరాముడికి విజయదశమి నాడు పాలపిట్ట ఎదురవుతుంది, ఆనాడు రాముడు దానిని శుభశకునంగా భావించాడని చెపుతారు, దసరా అంటేనే చెడుపై విజయానికి గుర్తు. ఇదే దసరా రోజున రావణాసురుణ్ని అంతమొందించి శ్రీరాముడు ఘన విజయం సాధించాడు. అలాగే రాక్షసుల రాజు మహిషాసురిడిని నేల కూల్చి… కాళికా మాత ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లే. అందుకే… పండుగ నాడు పాలపిట్టను చూడాలి. అదృష్టంగా భావించాలని చెబుతరు.. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.
ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా ... అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.ప్రజల జీవన ఐకమత్యాన్ని అనురాగాన్ని చాటి చెబుతుంది. అందుకే దసరా పండుగ మానవ సంబంధాల మనుగడకు ప్రతీకగా అద్దంపట్టి నిలుస్తోంది అనుటలో అతిశయోక్తిలేదు.
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్, ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.దసరానాడు ఆయుధాల్నీ, వాహనాల్నీ, వృత్తికి సంబంధించిన పరికరాల్నీ పూజించడం సంప్రదాయం. దీని వెనుక కూడా పౌరాణికకధ ఉంది. దుష్ట సంహారం కోసం వ్రతం చేసిన ఆదిశక్తి- సకల దేవతలు తనకు సమర్పించిన ఆయుధాల్ని పూజించి అఖండమైన శక్తిని సంతరించుకున్నదట. ఇదే ప్రేరణతో రాముడు ఆయుధాల్ని అర్చించి రావణుణ్ని సంహరించాడనీ, పాండవులు జమ్మిచెట్టునీ, శస్త్ర అ స్త్రాల్నీ పూజించి దాయాదుల్ని ఓడించారనీ పురాణాల్లో చెబుతారు. ఆ తర్వాతి తర్వాత యుగాల్లోనూ చక్రవర్తుల రాజులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం మన ఘన చరిత్రలో కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటికీ వీటిని అలాగే పాటిస్తారు.
రాజరాజేశ్వరీ దేవత స్తుతి …
యాదేవీ సర్వభూతేషు
రాజరాజేశ్వరీ రూపేణ సంస్థితా
నమస్తస్మైనమస్తస్మై నమస్తస్మై నమోనమః
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబర్ 20 మంగళ వారం ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి “శ్రీ రాజరాజేశ్వరి దేవి” గా అలంకారము చేస్తారు.
అమ్మవారికి నైవేద్యము: పులిహార, రవ్వ లడ్డూలు , గారెలు
అమ్మవారి చీర అలంకారం: ఆకుపచ్చ రంగు చీర
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com