తమిళ సినిమా కోసం ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామన్న మంత్రి రాజ్మోహన్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కోలీవుడ్ చిత్ర పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు తమిళనాడు మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు. చెన్నైలోని వడపళనిలో నిర్వహించిన తమిళ సినీ ప్రస్తుత నిర్మాతల సంఘం ఆరో వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికగా తమిళ సినిమాలకోసం ప్రత్యేకంగా ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు చేసే అంశంపై త్వరలోనే అధికారికంగా శుభవార్త వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే సంబంధిత వర్గాలతో ఉన్నత స్థాయి త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఈ ప్రతిపాదనపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో భాగంగా తమిళ సినీ నిర్మాతల సంఘం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అలాగే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 38 చిత్రాల నిర్మాతలకు మంత్రి రాజ్మోహన్ ఘనంగా అవార్డులు, పతకాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు రాజా కరుప్పసామి, తొలి సినిమా డైరెక్టర్లను ప్రోత్సహించేందుకు నిర్మాతలు మరింత ముందుకు రావాలని కోరారు. ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్త దర్శకులు ఉన్నారని, వారికి అవకాశాలు కల్పిస్తే మరిన్ని వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇకపై రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులను ప్రతి ఏటా క్రమం తప్పకుండా అందజేస్తామని మంత్రి రాజ్మోహన్ భరోసా కల్పించారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం తరఫున తగిన ప్రాధాన్యత ఇస్తామని, ఇండస్ట్రీలో పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సినిమా టికెట్ల విక్రయాలను పర్యవేక్షించడానికి మూవీ టికెట్ ట్రాకింగ్ అనే సరికొత్త యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలు తమిళ సినిమా రంగానికి సరికొత్త ఊపునిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.