భారత స్టాక్ మార్కెట్లలో మందకొడి ఆరంభం
సూర్య బిజినెస్ డెస్క్: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ మంటెత్తుతుండటం, దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టబోయే కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు భారత స్టాక్ మార్కెట్లలో అప్రమత్తతను పెంచాయి. ఈ గ్లోబల్ పరిణామాల ప్రభావంతో వారం ఆరంభంలోనే మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారంలో నిఫ్టీ 50, బిఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలు దాదాపు రెండన్నర శాతానికి పైగా నష్టపోవడంతో పెట్టుబడిదారులు తీవ్ర అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) సూచీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతుండటం బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఫ్లాట్ లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభమవుతాయనే సంకేతాలను ఇస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు ముడిచమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్ల ఊపును తగ్గిస్తున్నాయి.
మరోవైపు, ఈ వారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానపరమైన సమావేశంపై గ్లోబల్ మార్కెట్ నిపుణుల దృష్టి కేంద్రీకృతమైంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే భయాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి నిధులు అమెరికా బాండ్ మార్కెట్లకు తరలిపోయే ముప్పు ఉంటుంది.
దీనికి తోడు విదేశీ కార్పొరేట్ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, రెండో త్రైమాసిక (Q2) కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్ కదలికలను శాసిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర అమ్మకం దారులుగా మారడం దేశీయ సూచీలపైదన ఒత్తిడి పెంచుతోంది. ఐటీ, బ్యాంకింగ్ మరియు ఎనర్జీ రంగాలు నేడు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాలని ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు సూచిస్తున్నారు. ముడిచమురు ధరలలో స్థిరత్వం వస్తేనే భారత ఈక్విటీ మార్కెట్ మళ్లీ సానుకూల దిశగా పుంజుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.