వెంకటాపురంలో ఫీవర్ సర్వే లారా సర్వే
*వెంకటాపురంలో ఫీవర్ సర్వే , లార్వా సర్వే*
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల అర్బన్ పరిధిలోని వెంకటాపురంలో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా గుర్తింపు సర్వే నిర్వహించారు. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీస్తూనే, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి దోమల లార్వాను గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య మాట్లాడుతూ... ప్రజలకు పలు సూచనలు చేశారు:
*పరిసరాల శుభ్రత – వ్యక్తిగత రక్షణ:*
ఇంటి పరిసరాల్లో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు రాత్రి వేళల్లో దోమతెరలు వాడాలని, శరీర భాగాలను పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని సూచించారు. ఎవరికైనా తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని, ఆర్ఎంపీలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.
*దోమకాటుతో పొంచి ఉన్న ముప్పు:*
నిల్వ ఉన్న మంచి నీటిలో డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే ఎడిస్ దోమలు, మురుగు నీటిలో మలేరియా, బోదకాలు, మెదడువాపు వ్యాధులను కలిగించే దోమలు వృద్ధి చెందుతాయి. దోమకాటుకు గురైతే ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా బారిన పడే ప్రమాదం ఉంది.
*ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ‘డ్రై డే’:*
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ వారంలో ఒకరోజు, ముఖ్యంగా ప్రతి శుక్రవారం విధిగా ‘డ్రై డే’గా పాటించాలని పిలుపునిచ్చారు.
*డ్రై డే ఎందుకు పాటించాలి?:*
దోమలు గుడ్లు పెట్టి లార్వాగా, ఆపై దోమగా మారడానికి సుమారు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అందుకే వారానికి ఒకసారి ఇళ్లలోని నీటి తొట్టెలు, డ్రమ్ములు, కూలర్లు, నీటిని నిల్వ చేసుకునే ఇతర పాత్రలను పూర్తిగా ఖాళీ చేసి, ఎండబెట్టి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల దోమల ఉత్పత్తి చక్రం విచ్ఛిన్నమై దోమల వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సోమలింగారెడ్డి, శేషగిరి నాయక్, నాగమణి, ఆశా కార్యకర్త రాజమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్