స్థానిక పోరుకు రికార్డు స్థాయిలో అభ్యర్థుల నామ పత్రాలు
పూసపాటిరేగ, సూర్య : మండలంలోని మండల పరిషత్ స్థానిక సంస్థల పోరుకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అధిక స్థాయిలో అభ్యర్థులు ఉత్సాహం చూపారు. 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 160 మంది అభ్యర్థులు రికార్డు స్థాయిలో నామినేషన్లను వేశారు. కూటమిలో తెదేపా, జనసేన, భాజాపా పార్టీల సర్దుబాట్లు ఓ కొలిక్కి రాకపోవడంతో కూటమిలో ఉన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులను, వైకాపా అభ్యర్థులు కూడా రంగంలోకి దిగడంతో అత్యధిక సంఖ్యలో స్థానిక పోరుకు అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేయడం గమనార్హం. వెల్దురు ఎంపీటీసీ అభ్యర్థిగా సూరిబాబు నామినేషన్ వేసేందుకు రాగా ఆ ఎంపీటీసీ పరిధిలో ఉన్న 500 మందితో గున్నారెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో అనుచరుగణం ర్యాలీగా వచ్చి నామ పత్రాలను అభ్యర్థి సూరిబాబు ఎన్నికల అధికారి గోపికి అందజేశారు. అదేవిధంగా చౌడమ్మ అగ్రహారం నుంచి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న భారీ ఎత్తున ఓటర్ల గణం ర్యాలీగా తరలివచ్చి పతివాడ అప్పమ్మ నామ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అదేవిధంగా చాలాచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీగా నిలవడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. నామ పత్రాల స్వీకరణకు సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో అప్పటికే నామపత్రాలను వేసేందుకు బారులు తీరడంతో ఎన్నికల అధికారి సిబ్బంది టోకెన్ సిస్టం ద్వారా నాంపత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా సాగించినట్లు అయ్యింది.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.