రిషి కాలేజీపై అసత్య ప్రచారాన్ని ఖండించిన యాజమాన్యం
బొబ్బిలి, సూర్య : పట్టణంలోని రిషి కాలేజీలో దీపావళి వేడుకలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కళాశాల యాజమాన్యం ఖండించింది. కళాశాల ప్రిన్సిపాల్ అల్లు వెంకట రమణ ఆధ్వర్యంలో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కళాశాలను నిర్వహిస్తూ, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పిస్తూ, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని యాజమాన్యం తెలిపింది. దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులందరి భాగస్వామ్యంతో కళాశాల ప్రాంగణంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ సంతోషంగా దీపాలు వెలిగిస్తూ, టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు. నిర్ణీత సమయ పరిమితులను పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంపై విద్యార్థుల నుంచి గానీ, వారి తల్లిదండ్రుల నుంచి గానీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు. అయితే కళాశాల ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహించిన విషయాన్ని వక్రీకరిస్తూ, అర్ధరాత్రి వరకు డీజేలు నిర్వహించారంటూ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కళాశాలపై అసత్య ప్రచారం చేస్తుండటం విచారకరమని యాజమాన్యం తెలిపింది. వాస్తవానికి కళాశాలలో దీపావళి వేడుకలను నిర్ణీత సమయంలోనే నిర్వహించామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత, సంతోషమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకుని స్పందించాలని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని యాజమాన్యం ప్రతి ఒక్కరినీ కోరింది.