ప్రైవేట్ విద్యుత్ బస్సుల టెండర్లు రద్దు చేయాలి
పాలకొండ, సూర్య : ఆర్టీసీ మనుగడకు, ఉద్యోగుల ఉపాధి భద్రతకు ముప్పుగా మారే 1,450 ప్రైవేట్ విద్యుత్ బస్సుల టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పాలకొండ డిపో కన్వీనర్లు వావిలాపల్లి రాజేష్, ఎల్.డి.నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 22, 23 తేదీల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి సొంత సిబ్బందితో నడపాలని, 15 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేసి, మూసివేసిన నాలుగు డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 26న విజయవాడలో రాష్ట్ర జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్లు ఎస్టీ రావు, సాగర్, ఎస్.నాయుడు, డీజీరావు, డీజేబాబు, ఎంఆర్ మూర్తి, ఎం.ఎస్.రావు, యు.లక్ష్మి పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.