పీజీఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి
పీజీఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, అక్టోబర్ 05: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా గడువులోపు పరిష్కరించాలని, పరిష్కార నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి సేకరించే అభిప్రాయాల్లో జిల్లాకు మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ తమ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ప్రజల నుంచి అందిన ముఖ్యమైన అర్జీలు
రైతు భరోసా కోసం వినతి: మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం పరిధిలోని కొత్త కురాకులవారిపల్లికి చెందిన జంపాల సుబ్రమణ్యం తన భూమికి గతంలో రైతు భరోసా నగదు జమ అయ్యేదని, 2025 నుంచి నగదు జమ కావడం లేదని తెలిపారు. తన అర్హతను పరిశీలించి, అర్హత ఉంటే పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా మొత్తాన్ని మంజూరు చేయాలని కోరారు.
వక్ఫ్ భూముల పరిరక్షణకు వినతి: పీలేరు మండలానికి చెందిన షేక్ ఖాదర్ వలి వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను కొందరు ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి భూములను సర్వే చేసి, ఆక్రమణలను తొలగించి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు.
వికలాంగుడికి త్రిచక్ర వాహనం కోసం దరఖాస్తు: పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన జి. చెంగలయ్య తాను వికలాంగుడినని, ఇతరుల సహాయం లేకుండా బయటకు వెళ్లలేనని తెలిపారు. తనకు మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 337 అర్జీలు అందగా, వాటిపై తగిన చర్యలు తీసుకుని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో ఏ. వెంకటేష్, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, స్వర్ణ గ్రామ వార్డు జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి, సర్వే శాఖ ఏడీ శాంతరాజ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.