కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి ఆత్మహత్య
లక్కవరపుకోట, సూర్య : విశాఖపట్నంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పాలిక సురేష్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లేపల్లి గ్రామానికి చెందిన పాలిక సురేష్, విశాఖపట్నానికి చెందిన వాసుపల్లి భార్గవిని కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నట్లు సమాచారం. కొంతకాలం తర్వాత తన భర్త సురేష్, అతని కుటుంబ సభ్యులు పెళ్లయినప్పటి నుంచి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భార్గవి విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సురేష్ తల్లి మృతిచెందినట్లు సమాచారం. అనంతరం భార్గవి మరోసారి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి, కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ తనను సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న సురేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులను ముందుగా వెళ్లాలని చెప్పిన సురేష్, తాను తర్వాత వస్తానని తెలిపాడు. కుటుంబ సభ్యులు విశాఖపట్నం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలో సురేష్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి తండ్రి పాలిక సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని లక్కవరపుకోట ఎస్ఐ జె. రామకృష్ణ తెలిపారు.
రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట, విజయనగరం జిల్లా.