"బైరెడ్డి"కి మరోసారి అవకాశం
భోగాపురం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అనుభవం, ప్రజాబలం, పార్టీకి చేసిన సేవలను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భోగాపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. గతంలో జెడ్పీటీసీగా విజయం సాధించిన అనుభవంతో పాటు, పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు మరోసారి అవకాశం కల్పించడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
* 2001లోనే రాజకీయ అరంగేట్రం
బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజకీయ అనుభవం, సీనియారిటీ, పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం మరోసారి జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది.
* రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం
ప్రభాకర్‌రెడ్డి భార్య బైరెడ్డి పావని సైతం రాజకీయాల్లో తనదైన ప్రస్థానాన్ని కొనసాగించారు. 2006లో జెడ్పీటీసీగా, 2014లో గూడెపువలస ఎంపీటీసీగా పోటీ చేశారు. అలాగే 2009 తర్వాత రెండు పర్యాయాలు టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం, ప్రస్తుత పార్టీ బాధ్యతలు, కుటుంబ రాజకీయ నేపథ్యం బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అనుకూల అంశాలుగా నిలుస్తున్నాయి. మరోసారి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆయనకు ఈ ఎన్నికలు రాజకీయంగా కీలకం కానున్నాయి. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల మద్దతు కూడగట్టడం, గత అనుభవాన్ని ఓట్లుగా మలచుకోవడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ ఎన్నికల ఫలితం భోగాపురం మండల రాజకీయాల్లో ఆయన భవిష్యత్తుకు మరింత ప్రాధాన్యం కల్పించనుంది.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.